మిర్యాలగూడ మారుతీరావు ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తుంది. శనివారం అర్థరాత్రి ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో అయన ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పజెప్పారు. ఈరోజు ఉదయం మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మారుతీరావు ఆత్మహత్యపై ఆయన లాయర్ వెంకటసుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కుమార్తె తన దగ్గరకు రావట్లేదనే బాధతోనే అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారని లాయర్ చెప్పారు. ఓ మీడియా సంస్థతో సోమవారం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాల వివరాల్లోకి వెళ్తే..
ప్రణయ్ హత్య కేసు గురించి నాతో మారుతీరావు ఎప్పుడూ చర్చిస్తూ ఉండేవాడు. ప్రణయ్ తల్లిదండ్రులు ఎస్సీలు కాదని, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని కొద్ది రోజుల క్రితం ఫోటోలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. శనివారం రాత్రి నేనే ఆయనకు ఫోన్ చేశాను. ఈ ఫోటోలకు బదులు క్రిస్టియన్ గా కన్వర్ట్ అయిన దానికి సంబంధించి ఏమైనా పత్రాలు ఉంటే ఇవ్వాలని సూచించాను. మారుతీరావుపై ఎస్సీ, ఎస్టీ చట్టంపై కేసు పెట్టారు కాబట్టి..

ప్రణయ్ కుటుంబం ఎస్సీ కాదని నిరూపించేందుకు ఈ ఆధారాలను ఆయన సేకరిస్తున్నారు. మధ్యవర్తిత్వంతో తన కుమార్తె సమస్యను పరిష్కరించుకోవాలని మారుతీరావు ప్రయత్నించాడు. అయితే, తనను వేధిస్తున్నారని అమృత, తండ్రికి వ్యతిరేకంగా కేసులు పెట్టింది. కానీ, కుమార్తె తన వద్దకు వస్తుందని మాత్రం మారుతీరావు బలంగా నమ్మేవాడు. నాకు మారుతీ రావు ఏడేళ్ల నుంచి తెలుసు. నాలుగేళ్ల క్రితం ఒకరోజు మారుతీరావు నా ఆఫీసులో కూర్చొంటే, అతనికి అమృత ఫోన్ చేసి మెక్ డోనాల్డ్స్లో చికెన్ ఐటెమ్స్ తీసుకురావాలని కోరింది. కానీ మారుతీ రావు కుటుంబం మాంసాహారం ముట్టరు. కేవలం కూతురు కోసమే మాంసాహార వంటకాలు ప్రత్యేకంగా తీసుకెళ్లేవారు. అమృతపై మారుతీరావుకు అంత ప్రేమ ఉండేది.

కేసు విచారణ చివరి దశకు వచ్చేసరికి తన కుమార్తె తన వద్దకు వచ్చేస్తుందని మారుతీరావు బలంగా నమ్మేవాడు. కానీ, ఆమె వచ్చే పరిస్థితి కనిపించలేదు. అంతేకాక, కోర్టులో సాక్ష్యం కూడా వ్యతిరేకంగానే చెప్తుందని భయపడి ఉంటాడు. బహుశా ఆశలు సన్నగిల్లడంతోనే మారుతీరావు ఆత్మహత్య చేసుకొని ఉంటాడు. ఆస్తులకు సంబంధించి తనకు ఆస్తుల తగాదాలు ఏం లేవు. తమ్ముడు శ్రవణ్ పైన కూడా ప్రేమ ఉండేది. ఈ కేసు విషయంలో తనను కలిసేందుకే మారుతీరావు తరచూ హైదరాబాద్ వచ్చేవారు. పిరికితనంతో ఆత్మహత్య చేసుకొనే తత్వం మారుతీరావుకు లేదని సీనియర్ లాయర్ వెంకట సుబ్బారెడ్డి చెప్పారు. ఇక మారుతీరావు తన యావదాస్తిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని అతని భార్యకు ఇచ్చాడు.

ఇక రెండవ భాగాన్ని ఒక ట్రస్ట్ పేరిట రాయగా చివరిదైన మూడో భాగాన్ని తన ఏకైక సోదరుడి యొక్క కొడుకులకు పేరు మీద రాసిచ్చేశాడట. దీనిని బట్టి చూస్తే మారుతీరావు తన ఆత్మహత్యకు ముందునుంచే ప్రిపేర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అతనితో ఉన్నా కూడా అతని భార్య ఆస్తిని అనుభవించవచ్చు. కానీ అతని చావు గురించి అతనికి ముందే తెలుసు కాబట్టి మారుతీరావు తన భార్యకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందే ఆస్తిని రాసి ఇచ్చినట్లు పలువురు అనుకుంటున్నారు