మే 31 నాటికి ఇండియాలోని ఆ ఒక్క జిల్లాలోనే 8 లక్షల కరోనా కేసులు

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కొనసాగితే మే 31 నాటికి అహ్మదాబాద్‌లో 8 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయని నగర మున్సిపల్ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా మాట్లాడుతూ..

‘ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల వేగం పెరుగుతోంది. నాలుగు రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే అహ్మదాబాద్ జిల్లాలో మే 15 నాటికి మొత్తం 50వేల కరోనా కేసులు నమోదవుతాయి. ఆ లెక్కన చూస్తే మే 31 నాటికి 8 లక్షల కేసులు నమోదవుతాయి.’ అని అన్నారు. అహ్మదాబాద్‌లో 1600 కరోనా పాజిటివ్ కేసులు దాటాయి.

గురువారం ఒక్కరోజే కొత్తగా 151 కేసులు రికార్డు అయ్యాయి. గుజరాత్‌లోని మొత్తం కరోనా కేసుల్లో 60 నుంచి 65 శాతం వరకు కేసులు ఒక్క అహ్మదాబాద్‌లోనే నమోదవుతున్నాయి.

గుజరాత్‌లో ప్రస్తుతం 2624 కరోనా కేసులు ఉన్నాయి. 112 మంది ప్రాణాలు కోల్పోయారు. 258 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఒక్కరోజే 217 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం జారీ చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Content above bottom navigation