నారాయణ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య… విద్యార్థిని తండ్రిని బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్…?

86

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల నారాయణ క్యాంపస్‌‌ లో ఇంటర్ విద్యార్థిని సంధ్యారాణి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్ వాష్‌ రూమ్‌లో ఆమె ఆత్మహత్య చేసుకుందని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. బుధవారం బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ కోసం తరలిస్తుండగా, ఆమె తండ్రి శవపేటికకు అడ్డుపడ్డాడు. దీంతో ఓ పోలీస్ అధికారి నిర్దాక్షిణ్యంగా అతన్ని బూటు కాలితో తన్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి

బుధవారం కొంతమంది పోలీసులు క్యాంపస్ హాస్టల్‌ నుంచి బాలిక మృతదేహాన్ని శవపేటికలో పోస్టుమార్టమ్‌కు తరలించారు. విద్యార్థి సంఘాల నాయకులు, సంధ్య తల్లిదండ్రులు ఈరోజు పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రి తాళం పగులగొట్టి సంధ్యారాణి మృతదేహం తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. విద్యార్థి సంఘాలు, యువతి తల్లిదండ్రులు మృతదేహం తీసుకొని గేటు వద్దకు వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. మృతదేహాన్ని తమకు అప్పగించాలని కాళ్లావేళ్లా పడినా పోలీసులు కనికరించలేదు. ఆ సమయంలో మృతురాలి తండ్రి శవపేటికను అడ్డుకున్నాడు. అక్కడినుంచి కదలనివ్వకుండా, కింద పడుకుని శవపేటికను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అతన్ని బూటు కాలితో తన్నిన ఓ పోలీస్ అధికారి, అక్కడినుంచి పక్కకు ఈడ్చిపారేశాడు. అక్కడే ఉన్న అతని భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. కూతురు చనిపోయిన దు:ఖంలో ఉన్న ఆ తండ్రిపై సదరు పోలీస్ కానిస్టేబుల్ చేసిన దాడి చాలామందిని కలచివేసింది. సదరు అధికారిపై తీవ్ర విమర్శలు రావడంతో మెదక్ ఎస్పీ చందనా దీప్తి అతన్ని సస్పెండ్ చేశారు. ఘటనపై విచారణకు కూడా ఆదేశించిన ఎస్పీ, ఆ పోలీస్ కానిస్టేబుల్‌ కి కౌన్సెలింగ్ కూడా ఇప్పిస్తామని చెప్పారు. ఘటనపై చందనా దీప్తి మాట్లాడుతూ.. పోలీసులు శవపేటికలో బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ కి తరలిస్తున్న సమయంలో మృతురాలి కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారని చెప్పారు. బాలిక మృతదేహాన్ని వారు అక్కడినుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని అన్నారు.

Image result for నారాయణ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

బాలిక ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు ఇంతవరకు స్పష్టం కాలేదు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తీవ్రమైన జ్వరం, డిప్రెషన్‌ తో బాధపడుతున్నందువల్లే తమ కుమార్తె చనిపోయిందని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఆమె చనిపోయిన తర్వాత చాలాసేపటి వరకు తమ సమాచారం ఇవ్వలేదన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఫోన్ చేసి సంధ్య ఆరోగ్యం బాగాలేదని, అర్జెంటుగా రావాలంటూ ఫోన్ చేశారని మృతురాలి తల్లి చెప్పింది. తాము వచ్చే సరికి నల్లగండ్లలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని చెప్పింది. వాష్ రూమ్ లోని గ్లీజర్ పైపుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాలేజీ సిబ్బంది చెబుతున్నారని, తమ కుమార్తెకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాలేజీ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. వాష్‌ రూమ్‌ లో ఉండే చిన్నసైజ్ కొక్కేనికి ఎలా ఉరేసుకుంటారని ప్రశ్నించింది. కూతురు మరణంతో బాధలో ఉన్న తల్లిదండ్రులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు తెలంగాణ ప్రభుత్వం గర్వంగా చెప్పుకునే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా…? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో విద్యార్థి సంఘాలు కాలేజీ యాజమాన్యంపై అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation