కరోనావైరస్ ప్రపంచం మొత్తాన్ని ఇళ్లలో బంధించింది. భారతదేశంలో కూడా కరోనా సోకిన రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. భారతదేశంలో ఇప్పటివరకు 873 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ సంఖ్య రోజు రోజురోజుకు పెరుగుతోంది. ఈ వ్యాధిని నిరోధించడానికి వీలుగా దేశ ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. కరోనా భయం కారణంగా దేశ జనాభాలో ఎక్కువ భాగం ఇంట్లో ఉంటున్నారు. అయితే, ప్రజలకు సహాయపడటానికి కొన్ని ముఖ్యమైన సేవలు కొనసాగుతున్నాయి. ఇందులో, వైద్య సేవలతో సంబంధం ఉన్న వ్యక్తులు ముందంజలో ఉన్నారు. వీరిలో వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆరోగ్య సేవలతో సంబంధం ఉన్నవారు సేవలు అందిస్తున్నారు. ఈ ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని పెంచడానికి, పూణేలోని డాక్టర్ నాయుడు ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్న నర్సు ఛాయతో ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..
కరోనా బాధితుల కోసం నిరంతరం పనిచేస్తున్న డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, క్విక్ రెస్పాండర్లలో నూతనోత్తేజం నింపేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం మహారాష్ట్ర పుణెలోని నాయుడు హాస్పటల్ లో కోవిడ్ బాధితులకు సేవలందిస్తున్న నర్సు ఛాయకు ఫోన్ చేసిన మోదీ, ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో కరోనా బాధితులకు సేవలు చేస్తోన్న స్టాఫ్ పై ప్రశంసలు కురిపించారు. నర్సు ఛాయతో ప్రధాని మోదీ 5 నిమిషాల పాటు సంభాషించారు. వారి యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. ఆమెను అక్కడ బాగా చూసుకుంటున్నారా లేదా అని ప్రధాని మోదీ సిస్టర్ ఛాయను అడిగారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, రోగులతో పాటు తనను బాగా చూసుకుంటున్నారని తెలిపింది. ఎవరైనా కరోనా బాధితుడు ఆస్పత్రికి వచ్చినప్పుడు చాలా భయపడతారు కదా అని మోదీ అడిగారు. అందుకు ఔనని సమాధానం ఇచ్చిన ఛాయ, వారికి కరోనా నిర్ధారణ అయిందని, వారిని అడ్మిట్ కావాల్సిందిగా కోరితే మరింత భయపడతారని తెలిపారు. ఆ తర్వాత తాము వారితో మాట్లాడతామని, వారి భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఒకవేళ వారికి కరోనా పాజిటివ్ వచ్చినా కూడా భయపడాల్సిన పనిలేదని చెబుతామన్నారు.

ఈ ఆస్పత్రి నుంచి ఏడుగురు కరోనా బాధితులు కోలుకుని ఇంటికి వెళ్లారని తాము చెబుతామన్నారు. రోగి డాక్టర్‌కు పూర్తిగా సహకరిస్తే, వారికి తప్పకుండా నయం చేయగలమని ధైర్యం చెబుతామని సిస్టర్ ఛాయ తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 9 మంది కరోనా బాధితులు ఉన్నారని, వారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, భయపడాల్సిన పనిలేదని చెప్పారు. కరోనా బాధితులకు సేవలు చేయడం పట్ల ఇంట్లో ఎటువంటి అభ్యంతరాలు ఎదురుకాలేదా? అని మోడీ అడగగా, మా ఫ్యామిలీకి ప్రమాదమన్న భయం ఉందని.. అయితే ఈ విపత్కర పరిస్థితిలో బాధితులకు సేవలు అందించాలి. కుటుంబాన్ని మానసికంగా సంసిద్దం చేసి పనిచేస్తున్నా. అటు ఆందోళన చెందవద్దని బాధితులకు సూచించడంతో పాటు వారి రిపోర్టులు నెగిటివ్‌గా వస్తాయని ధైర్యం నూరిపోస్తున్నా అని నర్సు ఛాయ చెప్పింది. దానికి మోదీ, మీలాగే ఎందరో నర్సులు, పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లు తపస్సులా సేవలను కొనసాగిస్తున్నారు.. మీ అనుభవాలు వినడం ఆనందంగా ఉంది అని అన్నాడు. దానికి నర్సు ఛాయ, నా డ్యూటీ నేను నిర్వర్తిస్తున్నా.. మీరు 24 గంటలు దేశం కోసం పనిచేస్తున్నారు.. మీతో మాట్లాడటం గర్వంగా ఉంది అని చెప్పింది. ఇలా నర్స్ కు, ప్రధానమంత్రి మోడీకి మధ్య సంభాషణ జరిగింది.ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.