25 స్కూళ్లలో పనిచేస్తున్న టీచరమ్మ, కోటి ఆదాయం.. అధికారులు షాక్, ఎలా సాధ్యం?

90

ఆమె ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు. కానీ, అధికారుల కళ్లుగప్పి మరిన్ని పాఠశాలల్లో పనిచేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 పాఠశాలల్లో పనిచేస్తూ.. 13 నెలలుగా కోటి రూపాయల వరకు సంపాదించింది. అనుమానం రాకుండా ఈ వ్యవహారం నడుస్తోంది. చివరికి ప్రభుత్వం రూపొందించిన ‘టీచర్స్ డిజిటల్ డేటా బేస్‌’లో ఒకే పేరు, చిరునామా గల ఓ ఉపాధ్యాయురాలు ఒకటి కంటే ఎక్కువ పాఠశాలల్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కూపీ లాగగా.. ఆమె 25 స్కూళ్లలో పనిచేస్తున్నట్లు తెలుసుకొని విస్తూపోయారు. ఉత్తర ప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ టీచర్ పేరు ‘అనామికా శుక్లా’.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

సాధారణంగా కొంత మంది ప్రభుత్వ టీచర్లు గుట్టు చప్పుడు కాకుండా కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లోనూ పాఠాలు చెప్తూ రెండు చేతులా సంపాదిస్తుంటారు. కానీ, అనామికా పనిచేస్తున్న స్కూళ్లన్నీ ప్రభుత్వ పాఠశాలలే. అన్నీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవీ) రెసిడెన్షియల్ స్కూళ్లే.
ఒకే వ్యక్తి ఏకకాలంలో ఇన్ని పాఠశాలల్లో ఎలా పనిచేయగలిగారు? అటెండెన్స్ ఎలా మెయింటేన్ చేయగలిగారు? అనేవి ఇప్పుడు అధికారుల ముందున్న చిక్కు ప్రశ్నలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆమె ఒరిజినల్ పోస్టింగ్ ఏ స్కూల్లో ఉందో కూడా తెలియని పరిస్థితి. ఈ అంశాలపై అనామికను ప్రశ్నించడానికి ప్రయత్నించగా.. ఆమె కాంటాక్ట్‌లో లేకుండా పోయింది. ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో తాను ఉంటున్న చిరునామా నుంచి పరార్ అయింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యూపీ‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో అనామిక శుక్లా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే.. ప్రాథమిక విద్యా విభాగం టీచర్ల డిజిటల్ డేటాబేస్ రూపొందిస్తున్న క్రమంలో కొన్ని జిల్లాల్లో వేర్వేరు పాఠశాలల్లో ఒకే టీచర్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. అనామిక శుక్లా అనే టీచర్.. అమేథి, అంబేద్కర్ నగర్, రాయ్ బరేలి, అలీగఢ్‌తో పాటు 25 చోట్ల కేజీబీవీ స్కూళ్లలో ఒకేసారి ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఆయా పాఠశాలల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13 నెలలకు గాను రూ. కోటికి పైగా వేతనాన్ని ఆమె అందుకుందని అధికారులు తెలిపారు.

వేతనంగా కోటి రూపాయలు పొందిన అనామిక.. అందుకోసం ఏ బ్యాంకు ఖాతాను వాడిందో తెలుసుకునేందుకు కూడా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే విద్యాశాఖ అధికారులు ఆమె వేతనాన్ని నిలిపివేసి నోటీసులు పంపించారు. కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు.
యూపీలో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. అధికారుల హస్తం లేకుండా ఇంత పెద్ద నేరం జరిగి ఉండదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఘటనపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్ విజయ్ కిరణ్ ఆనంద్ స్పందించారు.

ఈ విషయంలో నిజానిజాలపై ఇంకా ఎలాంటి ధృవీకరణ రాలేదని తెలిపారు. అనామిక అసలు తాత్కాలిక ఉద్యోగా? లేకపోతే ఫుల్ టైమ్ ఎంప్లాయా? అనేది తేలాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారని.. ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేజీబీవీలో కాంట్రాక్టు పద్ధతిలోనూ నియామకాలు ఉంటాయనీ.. వాస్తవాలను పరిశీలిస్తున్నామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Content above bottom navigation