పుల్వామా దాడి.. ఫుల్ స్టోరీ

95

పుల్వామా ఉగ్రదాడి…. . 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలగొన్న ఆ మారణకాండను ఏ భారతీయుడు కూడా అంత ఈజీగా మరిచిపోలేడు. ఈ దారుణకాండకు ఈరోజుతో సరిగ్గా ఏడాది నిండింది. దేశంలో చోటు చేసుకున్న కొన్ని కీలక పరిణామాలకు పుల్వామా ఉగ్రవాదుల దాడి కారణమైంది.. కేంద్రబిందువుగా మారింది. పుల్వామా ఉగ్రదాడి తరువాత కేంద్ర ప్రభుత్వం రక్షణపరంగా కొన్ని సంక్లిష్ఠ నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చింది. తన విధానాలు, వ్యూహాలను మార్చుకోవడానికి దారి తీసింది. ఒక్కసారి ఈ దాడికి సంబందించిన పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

Image result for pulwama attack 14 feb

జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ఉగ్రవాదులు భీకర దాడి చేశారు. సెలవులను ముగించుకుని విధుల్లో చేరడానికి బయలుదేరిన సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై చోటు చేసుకున్న ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరవీరులయ్యారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్‌ భూభాగంపై నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తోన్న జైషె మహమ్మద్ సంస్థ.. ఈ దాడులకు తామే కారణమని ప్రకటించుకుంది. తమ ఆత్మాహూతి దళ సభ్యుడు ఈ దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపురలో 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడికి కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్‌ ను వినియోగించారు. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. పక్కా వ్యూహంతోనే ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. సీఆర్పీఎఫ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్, తన వాహనాన్ని జాతీయ రహదారిపై కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్‌కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అవంతీపొర సమీపంలో లాటూ గుండా అతడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

Image result for pulwama attack 14 feb

సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది, మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహానాన్ని ఢీకొట్టాడు. ఉగ్రదాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది, సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని ఐదో బస్సును ఢీకొట్టాడు. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు. జమ్మూ-శ్రీనగర్‌ రహదారిలో లెత్‌పోరా వద్ద రోడ్డు చాలా వాలుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో వాహనాలు నెమ్మదిగా వెళ్తాయి. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ సైతం నిదానంగా వెళ్తుందని ముందే అంచనా వేసిన ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్‌లోని 5వ బస్సును లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రదేశంలో ఎటువంటి సీసీ కెమేరాలు లేకపోవడంతో వారి పని మరింత సులువైంది.

ఈ క్రింది వీడియోని చూడండి

సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 10మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్ మరింత ప్రతీకారంతో రగిలిపోయింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్.. అందుకు మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్‌ను ఎంచుకుంది. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వాయుసేన విమానాలు.. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఈ ఎయిర్‌ స్ట్రయిక్స్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి. బాలాకోట్ ఎయిర్‌ స్ట్రయిక్స్ తర్వాత దాయాదుల మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. ఈ దాడికి ప్రతీకారంగా సరిహద్దుల్లోని సైనిక స్థావరాలపై ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాకిస్థాన్ దాడికి ప్రయత్నించింది. అయితే, వీటిని భారత సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది. ఇక ఏ దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలు ఇప్పుడు దారుణ పరిస్థితిలో ఉన్నాయి. ఆ దాడి తర్వాత సైనికుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోలేదు. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని కోరుకుందాం.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation