కోవిడ్ -19 ప్రపంచాన్ని వణికిస్తుంది. భారత్ తో పాటు 184 దేశాలు కోవిడ్ దాటికి వణికిపోతున్నాయి. ప్రతి రోజువందల సంఖ్యలో కోవిడ్ భాదితులు పెరిగిపోతున్నారు.భారత్ లో దీనిని నియంత్రిచడానికి నిన్న జనతా కర్ఫ్యూ నిర్వహించారు. అలాగే యావత్తు భారతావని లాక్ డౌన్ అయ్యింది. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మార్చి 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ను ప్రకటించాడు. అసలు లాక్ డౌన్ అంటే ఏంటి.. ఎలాంటి పరిస్థితులు తెలంగాణాలో ఉంటాయి. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

అంటు వ్యాధుల చట్టం-1897 లోని సెక్షన్ 2,3,4 ప్రకారం.. కోవిడ్-19 వ్యాధి నియంత్రణ, నివారణకు కఠినమైన నిబంధనలు అమలు చేస్తారు. గాలి ద్వారా, లేదా మనిషి నుంచి మనిషికి వ్యాధి సోకకుండా నియంత్రించేందుకు అత్యవసరం మినహా సకల వ్యవస్థలను దిగ్బంధించే ప్రయత్నం చేస్తారు. దీన్నే లాక్ డౌన్ గా పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కృష్ణా, ప్రకాశం జిల్లాలనే లాక్ డౌన్ జాబితాలో చేరుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ సర్కారు ప్రకాశం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం తదితర జిల్లాల్లో లాక్డౌన్ నిబంధ నలను అమలు చేసే అవకాశం ఉంది. లాక్డౌన్ నుంచి మినహాయింపులుండేవి వేటి వేటికి అంటే.. శాంతి భద్రతలు, న్యాయవిధులు నిర్వహించే అధికారులు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్లు. పోలీసులు, వైద్య, ఆరోగ్యం, స్థానిక సంస్థలు, ఫైర్, విద్యుత్, తాగునీరు, బ్యాంకులు, ఏటీఎమ్‌లు, ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియా పాత్రికేయులకు మినహాయింపు ఉంటుంది. నిత్యావసరమైన ఆహారం, కిరాణా, పాలు, బ్రెడ్, పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు, వీటి నిర్వహణ, నిల్వలకు సంబంధించిన రవాణాకు వీలు కల్పిస్తారు. ఆస్పత్రులు, ఫార్మసీ, మందుల దుకాణాలు, మందుల తయారీ, ఉత్పత్తి, రవాణా, నిల్వ వ్యవహారాలకు మినహాయింపు ఉంటుంది. టెలికామ్, ఇంటర్నెట్, పోస్టల్ సేవలు కొనసాగుతాయి. నిత్యావసరాల సరఫరా సంస్థలు, వాటి రవాణా ఉంటుంది.
ఆహారం, మందులు, వైద్య పరికరాలను సరఫరా చేసే ఈ-కామర్స్ డెలివరీ సంస్థలు పనిచేస్తాయి. నిత్యావసరాలను ఇంటికి అందించేవి, నేరుగా ఇంటికే ఆహార పదార్థాలను సరఫరాచేసే రెస్టారెంట్లకు అనుమతిస్తారు. పెట్రోలు బంకులు, వంటగ్యాస్, ఆయిల్ ఏజెన్సీలు, వాటి గోడౌన్లు, రవాణా సంబంధ కార్యకలాపాలు కొనసాగుతాయి. నిరంతర సేవలు అందించే తయారీ, ఉత్పత్తి సంస్థలు కలెక్టర్ అనుమతితో పనిచేయవచ్చు. నిత్యావసరాలతో ముడిపడిన తయారీ, ఉత్పత్తి సంస్థలు, వాటి కార్యకలాపాలు కొనసాగుతాయి. కరోనా నియంత్రణలో పాలుపంచుకొనే, లేదా ఆ చర్యలతో సంబంధం ఉండే ప్రైవేటు సంస్థలకు వెసులుబాటు కల్పిస్తారు. రైతులు, సాధారణ వ్యక్తులు నిత్యావసర సరుకులు, ఆహారపదార్థాలపై తమ రోజువారీ కార్యాచరణ చేపట్టడానికి అనుమతించాలి. అయితే, వారు కూడా సమూహదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజా రవాణాను నిలిపివేస్తారు. టాక్సీలు, ఆటోలు తిరగనివ్వరు. వాటిని కూడా బంద్ చేస్తారు. అయితే అత్యవసర రవాణాకు మినహాయింపు ఉంటుంది. అంటే, ఆస్పత్రులకు వెళ్లడానికి, ఆస్పత్రుల నుంచి ఇళ్లకు రావడానికి వీలు కల్పిస్తారు. అంబులెన్స్‌లు తిరుగుతాయి. నిత్యావసరం కేటగిరీలో రాని దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు, వర్క్‌షాపులు, గోడౌన్లను మూసివేయాలి. విదేశాల నుంచి వచ్చిన వారు విధిగా జిల్లా కలెక్టర్ ఇచ్చే నోటిఫికేషన్‌కు కట్టుబడి ఇంట్లో క్వారంటైన్ లో ఉండాలి.

ఇదిలా ఉంటే.. ఏది అత్యవసరం, ఏది నిత్యావసర సర్వీసు పరిధిలోకి వస్తుందన్నదానిపై చాలా మందికి సందేహం వస్తుంది. వీటిని కలెక్టర్, లేదా పురపాలక అధికారులతో నివృత్తి చేసుకోవాలి. కరోనా నియంత్రణలో భాగంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, పోలీసు యంత్రాంగం, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, తహసీల్దారు, ఎంపీడీఓ, ఇతర అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తారు. కరోనా నియంత్రణకోసం తీసుకుంటున్న చర్యలకు విఘాతం కలిగించేలా, లే దా వ్యాధి నిరోధానికి చేపట్టిన చర్యలకు భంగం కలిగించేలా వ్యవహరించే వ్యక్తులపై ఐపీసీ 188 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు. విదేశాల నుంచి వచ్చే వారిని గుర్తించి వెంటనే తగిన సంరక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిపై నిరంతరం పోలీసు నిఘా, నియంత్రణ కొనసాగించాలి.
వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి. సోషల్ డిస్టాన్స్ ను పాటించాలి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల సామర్థ్యం కలిగిన క్వారంటైన్ కేంద్రాలను నెలొకల్పాలి. దీనిపై 24 గంటల్లోగా కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వాలి. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో కోవిడ్-19 చికిత్స కోసం 200-300 పడకల సామర్థ్యం కలిగిన ఆస్పత్రులను సిద్ధం చేయాలి. ఒకటి రెండు జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో బోధనాస్పత్రులు ఉన్నాయి. వాటినే ఇందుకోసం సిద్ధం చేస్తారు. నిత్యావసరాలు, మందుల ధరలను ప్రకటించి ఎప్పటికప్పుడు వాటి అమలు, పర్యవేక్షణకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ధరలపై ప్రకటనలు జారీ చేయాలి. అత్యధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలి. బహిరంగ ప్రదేశాల్లో పదిమందికి పైగా గుమిగూడి ఉండటాన్ని నిషేధించాలి.