Friday, July 30, 2021

ఏనుగులు గుంపు జనావాసాల్లోకి.. హడలిపోయిన ప్రజలు, ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు

Must Read

చిత్తూరు జిల్లాలో పలమనేరు పట్టణ సమీపంలోని ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. పట్టణ సమీప ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.

 

ఏనుగుల గుంపు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం దగ్గరలో కనిపించాయి. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఏకంగా 26 ఏనుగుల గుంపు పట్టణ సమీపంలో ఘీంకారాలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని వాటిని అడవిలోకి పంపేందుకు సిద్ధపడ్డారు.

అటవీ అధికారులు ఏనుగుల గుంపును అడవిలోకి పంపించేందుకు బాణాసంచా కాలుస్తున్న సమయంలో ట్రాకర్‌ హరిబాబు చేతిలో ఓ పటాసు పేలి ఆయన కుడిచేతి మూడు వేళ్లు తెగిపోయాయి. మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. మరోవైపు ఏనుగుల గుంపు అడ్డొచ్చిన వస్తువులను తొక్కేస్తూ బొమ్మదొడ్డి, బోడిరెడ్డిపల్లె గ్రామాల మీదుగా కదిలాయి.

ఏనుగు బోడిరెడ్డిపల్లె రైతుకు చెందిన ఓ పాడి ఆవును తొండంతో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ఆ సమీపంలోని రైతులు కట్టేసిన పశువులన్నింటినీ వదిలేసి, పొలాల్లోకి తరిమేశారు. ఆ తర్వాత ఏనుగుల గుంపు బొమ్మదొడ్డి చెరువులోకి దిగి జలకాటలు ఆడాయి. ఫారెస్ట్ అధికారులు వాటిని సాయంత్రం 5 గంటల సమయంలో అడవిలోకి మళ్లించగలిగారు. పలమనేరుకు సమీపంలో అటవీ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాయని, తిరిగి వాటిని పంపించడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులు తెలిపారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This