Friday, July 30, 2021

స్వర విద్వాంశుడు మంగళంపల్లి బాల మురళీకృష్ణ జయంతి సందర్భంగా…

Must Read

స్వరజ్ఞాని మంగళంపల్లి బాల మురళీకృష్ణగారు కర్ణాటక, హిందుస్థానీ సంగీత సారాలను ఒడిసిపట్టిన విద్వన్మణి. నటుడిగా, వాగ్గేయకారుడిగా, సినీ సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకుడిగా, నూతన రాగాల సృష్టికర్తగా, వయొలిన్ విద్వాంసునిగా బహుముఖ ప్రజ్ఞ కనబరించిన గొప్ప వ్యక్తి. అన్నింటినీ మించి ఆయన సరస్వతీ దేవి గారాల బిడ్డ. తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూక శంకరగుప్తంలో 1930 జూలై 6న మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఏడేళ్ల వయస్సులోనే కచేరీకి వేదికనెక్కి బాలమేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆయన జన్మించిన 15వ రోజు తల్లి కన్నుమూశారు. మగపిల్లవాడు పుడితే మురళీకృష్ణ అని పేరు పెట్టాలని తల్లిదండ్రులు అనుకున్నారు. అందరూ అలానే పిలిచారు. ఓ వేదికపై హరికథ భాగవతులు బాలమురళీకృష్ణ అని పేర్కొనడంతో ఆ పేరు స్థిరపడింది. ఆరవ తరగతి పరీక్ష తప్పడంతో స్కూలు చదువు అటకెక్కింది. చిత్రం ఏమంటే… ఆ తర్వాత ఆ గాన కళానిధి స్వరజ్ఞానానికి తలవొగ్గి వివిధ విశ్వవిద్యాలయాలు 12 గౌరవ డాక్టరేట్లను ఇచ్చాయి.

బాల మురళీకృష్ణకు పారిపల్లి రామకృష్ణ పంతులు గురువు. వారి తండ్రికీ ఆయనే గురువు కావడం మరో విశేషం. వీణ, వయోలిన్‌, మృదంగం, కంజీర లాంటి వాయిద్యాల్లో కూడా బాల మురళీకృష్ణ ప్రజ్ఞాశాలిగా భాసిల్లారు. 1939 నుంచి దాదాపు జీవిత చరమాంకం వరకూ కచేరీలు చేస్తూనే ఉన్నారు. మంగళంపల్లి చాలా యేళ్ళు బెజవాడ రేడియో స్టేషన్లో సంగీత ప్రయోక్తగా పనిచేశారు. బెజవాడలో ఏర్పాటు చేసిన సంగీత కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్ కూడా ఆయనే. రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఆ తర్వాత మద్రాసుకు మకాం మార్చారు.

బాల మురళీకృష్ణ ప్రయోగశీలి. నేటి ప్రయోగం రేపటికి సంప్రదాయం అవుతుందనేది ఆయన విశ్వాసం. కొత్త రాగాలకు, తాళాలకు ఆయన జన్మనిచ్చారు. గణపతి, సర్వశ్రీ, మహతి, లవంగి వంటి సరికొత్త రాగాలను సృష్టించి సంగీతబ్రహ్మగా ఖ్యాతి గడించారు. 72 మేళకర్తలతో కృతులు రచించారు. తెలుగు, కన్నడ, సంస్కృతాలలో కృతులు రాసి త్యాగరాయ కీర్తనలతో పాటు వాటినీ గానం చేశారు. అలా ఆయన కూడా వాగ్గేయకారుల జాబితాలో చేరిపోయారు. నదీనదాలను సాగరం తన గర్భంలో దాచుకున్నట్టు బాల మురళీకృష్ణ హిందుస్థానీ, కర్ణాటక, లలిత సంగీతాలను తనలో నింపుకున్నారు. బెంగాలీలో పాడి వంగదేశీయుల మెప్పును పొందారు. హిందుస్థానీలో గానం చేసి ఉత్తరాది వారి మదిని పులకింప చేశారు. తన జీవితకాలంలో వివిధ దేశాలలో 25 వేలకు పైగా కచేరీలు చేశారు.

కర్ణాటక సంగీతకారులలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్… ఇలా మూడు జాతీయ పురస్కారాలూ పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. మధుర, మనోజ్ఞ, మంగళ నాదాల శిరోమణి మంగళంపల్లి బాల మురళీకృష్ణ తన 86వ యేట (22 నవంబర్ 2016) చెన్నైలో కన్నుమూశారు. ఆ సుస్వర మహర్షి భౌతికంగా దూరమైనా తన కీర్తనలు, పాటలతో సంగీత ప్రియుల హృదయసీమలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This