తెలంగాణకు 500 కోట్ల భారీ విరాళం ఎవరిచ్చారో తెలిస్తే షాక్

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి టిఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ సంపూర్ణ మద్దతు పలికారు. వ్యాధి వ్యాప్తి నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సహాయంగా ఒక నెల వేతనం, ఒక ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు మొత్తం కలిసి దాదాపు 500 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించడానికి ముందుకు వచ్చారు. 

ఎలా అంటే ఒక్కో ఎంపీకి ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ది కోసం నిధులు మంజూరవుతాయి. ఈ ఏడాది టిఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలకు మంజూరయ్యే మొత్తం 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించనున్నారు. దీనికి సంబంధించిన కన్సెంట్ లెటర్ ను టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె.కేశవరావు, ఉప నాయకుడు బండ ప్రకాశ్, లోకసభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, ఉప నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు. 

వారే కాక ముఖ్యమంత్రి సహా రాష్ట్ర మంత్రులు, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడ తమ ఒక నెల వేతనాన్ని సిఎం సహాయనిధికి అందించాలని నిర్ణయించారు. ఒక్కో ఎమ్మెల్యే, ఒక్కో ఎమ్మెల్సీకి ఏడాదికి రూ. 3 కోట్ల చొప్పున నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. ఏడాది నిధులను కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందివ్వనున్నట్లు టిఆర్ఎస్ శాసనసభా పక్షం ప్రకటించింది. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ కోసం చేపట్టే చర్యల కోసం తమ నిధులను, జీతాలను కేటాయించిన మంత్రులు, ఎంపిలు,ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను  ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. చట్టసభల సభ్యులు చూపించిన స్పూర్తి ప్రభుత్వానికి ఎంతో ఉత్సాహం ఇస్తుందని సిఎం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఆపద సమయంలో ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు రావడం గొప్ప విషయమని సిఎం అన్నారు. కాగా, రాజ్యసభ సభ్యులు, లోకసభ సభ్యులు తమ ఒక నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి, మరో నెల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి అందిస్తారని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ప్రకటించారు.

Content above bottom navigation