కరోన నేపద్యం లో మోడీ మరో సంచలన నిర్ణయం

దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో జనాభా లెక్కలను కేంద్రం నిరవధికంగా వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు జనగణన వాయిదా పడుతుందని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జాతీయ జనాభా పట్టిక( ఎన్పీఆర్‌) జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజుల నుండి ఎన్పీఆర్‌ వాయిదా పడుతున్నట్లు వస్తున్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి.

దేశంలో కొన్నాళ్లుగా ఎన్పీఆర్‌ పై తీవ్ర చర్చ జరుగుతోంది. కేంద్రం ఎన్పీఆర్‌ కోసం ఇప్పటివరకూ 13,000 కోట్ల రూపాయలు కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఎన్పీఆర్ లో సామాజిక నేపథ్యం, ఆర్థిక స్థితిగతులు, ఇతర వివరాలను సేకరించనున్నారు. ఈ వివరాలను సేకరించడంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఆరోగ్య శాఖ సూచనల మేరకు కేంద్రం ఎన్పీఆర్ ప్రక్రియను నిలిపివేసింది. ఆరోగ్య శాఖ భారీ సమూహాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్రం డేటా సేకరణను ఆపేసింది. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు ఎన్పీఆర్ ను వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరాయి. దేశంలో 13 రాష్ట్రాలు ఎన్పీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం ఎన్పీఆర్ కోసం చేసిన ఫార్మాట్ సరిగ్గా లేదని 13 రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇప్పటికే పలు రాష్ట్రాలు ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా తీర్మానం చేశాయి. ఎన్పీఆర్ వాయిదా విషయమై ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో గత కొన్ని రోజుల నుండి చర్చలు జరిగాయి. కరోనా తీవ్రత పూర్తిగా తగ్గిన తరువాత మాత్రమే ఎన్పీఆర్‌, జనగణన మొదలయ్యే అవకాశం ఉందని హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ప్రకటన చేశారు. మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 562కు చేరింది.

Content above bottom navigation