Tuesday, July 27, 2021

ఆరు హత్యలు .. మరికొన్ని హత్యలకు పథకరచన… నరహంతక ముఠా అరాచకాలు

Must Read

వ్యసనాలకు బానిసలైన కొందరు యువకులు ముఠాగా ఏర్పడి పనిలోపనిగా జననివాసాలకు దూరంగా ఉన్నఇళ్లను చోరీ చేస్తున్నారు.. పగటి పూట ఆటోలు నడిపడంతో పాటు కూరగాయలు అమ్మేవారు. పనిలోపనిగా ఒంటరి వృద్ధుల ఇళ్లను గుర్తించి రెక్కీ నిర్వహించాక హత్యలకు పాల్పడేవారు.

ఐదుగురు యువకులు కరుడుగట్టిన నేరస్థుల్లా మారారు. జల్సాల కోసం తొమ్మిది నెలల్లో ఆరుగురిని పాశవికంగా చంపేశారు. ఎవరూ గుర్తుపట్టకుండా, హత్యల ఆనవాళ్లు దొరకకుండా చాకచక్యంగా వ్యవహరించారు. పైగా తాము చంపిన వారి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. ఇదే విధంగా మరో 12 మందిని అంతమొందించేందుకు పక్కా ప్లాన్ వేసుకున్న సమయంలో అనూహ్యంగా పోలీసులకు చిక్కారు. ఈ ముఠా అరాచకాలను గురువారం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు మీడియాకు వివరించారు.

విజయవాడ శివారు పోరంకిలోని ఓ బ్యాంకు ఏటీఎంలో ఈనెల 12న చోరీ యత్నం జరిగింది. దర్యాప్తులో భాగంగా పెనమలూరు పోలీసులు సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించగా ముఖానికి ప్లాస్టిక్‌ కవర్లు వేసుకున్న వ్యక్తులు కనిపించారు. అనుమానంతో తాడిగడపకు చెందిన ఆటోడ్రైవర్‌ చక్రవర్తిని అదుపులోకి తీసుకోగా చోరీ యత్నానికి పాల్పడినట్లు అంగీకరించాడు. అతనిచ్చిన సమాచారంతో ముఠాలోని మిగిలిన వారిని పోలీసులు పట్టుకున్నారు. విచారణలో ఈ ముఠా చోరీలతో పాటు హత్యలు కూడా చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

పోరంకి, తాడిగడప, కామయ్యతోపు ప్రాంతాలకు చెందిన ప్రభుకుమార్‌, గోపీ రాజు, చక్రవర్తి అలియాస్‌ చక్రి, నాగదుర్గారావు అలియాస్‌ చంటి ఆటో డ్రైవర్లుగా పనిచేస్తుంటారు. ఫణీంద్ర కుమార్‌ పెయింటింగ్‌ చేస్తుంటాడు. వ్యసనాలకు బానిసలైన వీరు ముఠాగా ఏర్పడ్డారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో గతేడాది డిసెంబరులో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో నమోదైన నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. తొలుత వారు బుకాయించినా చివరికి హత్యల వివరాలు పోలీసులకు వెల్లడించారు.

నిందితులు తాము హత్య చేసిన తర్వాత ఇంటిపై నిఘా పెట్టేవారు. పోలీసులు వచ్చారా? బాధితులు, చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారో తెలుసుకునేవారు. మృతదేహాలను శ్మశానానికి పంపే వరకు అక్కడే ఉండటంతో పాటు అవసరమైతే అంత్యక్రియల్లోనూ పాల్గొనేవారు. ఇవి మాత్రమే కాకుండా కృష్ణా జిల్లాలోని కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు, గుంటూరు జిల్లాలోని తెనాలి, మంగళగిరిలో మరికొందరిని చంపాలని ఈ ముఠా సభ్యులు పన్నాగం పన్నారు. ఇప్పటికే రెక్కీ కూడా నిర్వహించారు. ఇంతలో పోలీసులకు దొరికిపోవడంతో 12 మంది ప్రాణాలు దక్కాయి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This